SRI DHARMAPURI KSHETRAM BRIEF STORY (MIYAPUR, HYDERABAD)

 


                                     శ్రీ ధర్మపురి క్షేత్రం సంక్షిప్త కథ 


                                   


              శ్రీ ధర్మపురి క్షేత్రం  అనాదిగా ఉన్నది చిన్నగా పెద్ద వేప చెట్టు నీడలో జ్యోతి స్వరూపిణియై చుట్టుప్రక్కల గ్రామ ప్రజల పూజలు అందుకునేది.
              సూక్ష్మ రూపము నుండి స్థూల రూపం లో శాంత స్వరూపిణిగా చిరునవ్వుతో భక్తులకు   కొంగు బంగారమై 1986 లో ఒకరోజు ఒక దొంగ హండి ని ఎత్తుకొని పోయి  గుట్టలో పారవేశాడు!  దానిని మనం పట్టించుకోలేదు!  వారం పది రోజులు పోయిన తరువాత ఎత్తుకెళ్లిన వాడు వచ్చి సరెండర్ అయి తన తప్పిదాన్ని అంగీకరించి అందులో 600 రూపాయలు ఉన్నాయని కష్టించి చేసి ఆ సొమ్ము తిరిగి ఇచ్చేస్తానని చెప్పినందువల్ల. ఒక వ్యక్తి ని అధర్మ మార్గం నుండి  ధర్మం వైపు  మళ్లించింది కాబట్టి ఈరోజు నుండి "శ్రీ ధర్మపురి" గా  పిలవబడుతుంది  అని  నామకరణం జరిగింది. అది క్షేత్రంగా విలసిల్లి  ఒక స్ఫూర్తి కేంద్రంగా,  శక్తి కేంద్రంగా  విలసిల్లుతోంది!
            సకల దేవతా నిలయంగా   భాసిల్లుతోంది!  అంతేకాదు దేవతలతో పాటు ఎందరో సద్గురువులు, పరమ గురువులు, అవధూతలు, యోగులు, జగద్గురువులు కూడా కొలువుదీరి ఉన్నారు.
              సరస్వతీ దేవి ఆలయం  ప్రక్కనే "వ్యాస మహర్షి"  మందిరం, దాని ముందు  20 కిలోల బరువు గల 4 వేదములతో  కూడిన పెద్ద గ్రంధం దర్శనమిస్తుంది.   విద్యార్థులు ఆ గ్రంధాన్ని  స్పృశించి  పునీతులవుతారు. ప్రతి సంవత్సరము డిసెంబరు 15వ తేదీ క్షేత్ర  అధిష్టాన దేవత పెద్దమ్మ అయినా శ్రీ విజయదుర్గా దేవి కి విశేషమైన పూజలు, వైవిధ్యంతో  జరుపుతారు.
     


    108  నదీజలాలు తెప్పించారు, 108 ఔషధాలతో అమ్మవారికి అభిషేకం చేయించి ఆయుర్వేద వైద్యులను సత్కరించారు. 108 ధాన్యాలతో అర్చించి ఆధునిక విద్యార్థులకు ప్రకృతి యొక్క విశిష్టతను తెలియ చేస్తారు!  108 మాంగల్యాలు  దంపతుల చేత పూజింపచేసి అమ్మవారి కంఠసీమలో అలంకరించి  దాంపత్య ధర్మ విశిష్టతను ఆధునిక మహిళలకు తెలియజేశారు.  108 జాతి గోవులను తెచ్చి  గోవులను రక్షించే వాళ్లకు పురస్కారాలు ఇచ్చారు. 5 దక్షిణాది రాష్ట్రాలలోని సేంద్రియ వ్యవసాయం చేసి కల్తీ లేని ఆహారాన్ని పండించే  108 మంది  రైతు దంపతులను  సత్కరించి వారి యొక్క ఔనత్యాన్ని,  అవసరాన్ని నేటి యువతకు  తెలియచేసి , వారికి కూడా వ్యవసాయం పట్ల మక్కువ కలిగించారు.


              వేద గ్రంధాన్ని ప్రతిష్టించి ధర్మాచార్యుల ను పిలిచి గౌరవించి సందేశాన్ని ఇప్పించారు. వేద పండితులను, సంస్కృత పండితుల ను గౌరవించి  పూజించారు. 108 మంది హరికథా  భాగవతులను రెండు  తెలుగు రాష్ట్రాలలోని వారిని ఆహ్వానించి మూడు రోజులపాటు హరికథా శ్రవణం ఏర్పాటు చేసి 108  మంది హరికథా భాగవతులను ఘనంగా ధరించారు.


                సంగీత,  సాహిత్య, నృత్య  గీతాలకు పెద్ద పీట వేస్తూ మూడు రోజులపాటు సంగీతం, వేదం, నృత్యం   108 మంది చేయి  అమ్మ సన్నిధిలో నృత్యార్చన  చేసి, 16 మంది సంగీత, నాట్య గురువులను సన్మానించారు.   " మానవతా మూర్తులను  మణిహారంగా"  అమ్మవారి సన్నిధిలో మానవసేవయే మాధవ సేవగా  గుర్తెరిగి, నిష్కామంగా, పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా సేవచేసే  విశిష్టులను " సేవా ప్రపూర్ణ"  బిరుదాంకితము చేసి సత్కరించి అమ్మ అనుగ్రహిస్తుంది.   అమ్మవారికి  "అచ్చ తెలుగు అట్లు అమ్మకు చెల్లేటట్లు" గా 108 అట్లు
వాయనాలు.  మాతృమూర్తులు పొయ్యిలు  వెలిగించి  మన తెలుగువారి ప్రాభవాన్ని  చాటుతుా, పారాయణలతో, అట్లు పోసి, ఆరగింపు  చేసే  కార్యక్రమం.



                  అంతేకాదు---- నిత్యము ఆకలిగొన్న వారికి అన్నము, ప్రతి పౌర్ణమి నాడు కాలుష్యానికి, కల్మషాన్ని కి దూరంగా  దైవ సన్నిధికి ఆబాలగోపాలాన్ని రప్పించి వారిని కోలాటాలతో, భజనలతో, నృత్యాలతో అలరింప చేసి,  అనుభూతి కలిగించి  భగవత్తత్వం లో  ఓలలాడించడం!  పౌర్ణమి నాటి పాయసం కోసం మరునాడు ఉదయం 4 గంటల నుండి  పబ్లిక్ బారులు తీరి ఉంటారు. అలాగే ప్రతి పుష్యమి నక్షత్రం  నాడు 0-16  సంవత్సరం లోపు  పిల్లలకు "  స్వర్ణామృత  ప్రాస"  ఆయుర్వేద   ఔషధ సేవనం ద్వారా   పిల్లలలో  చురుకుదనం, రోగ నిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెంపొందుతాయి.



          అలాగే సామూహిక   వరలక్ష్మీ వ్రతం, సత్య వ్రతాలు  మున్నగునవి. ఇవన్నీ  డబ్బుతో నిమిత్తం లేకుండా నే జరిగిపోతాయి. సేవా భావం ఉన్నవాళ్లు ఎవరికి వారే వారికి నచ్చిన సేవ చేసి తరిస్తారు. పేరు ప్రతిష్టలు ఆశించరు. వచ్చిన ప్రతి ఒక్కరూ అది  వారి పుట్టినిల్లుగా  భావిస్తారు. గుడి సంబరాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉగాది వేడుకలు  ఘనంగా జరుగుతాయి. అలాగే ప్రతి సంవత్సరము 13,14,15 మే 2019  శివకేశవుల  కళ్యాణ మహోత్సవం ఒకే వేదిక మీద ,ఒకే సమయంలో  జరుగుతుంది.
గమనిక:  ప్రతినిత్యం హోమం  జరుగుతుంది.


 


                                            ************************************